మా నేల పై ఫ్యాక్టరీ.... ఉద్యోగాలు మాకే కావాలి!.....
ప్రారంభోత్సవానికి ముందు న్యాయం: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికుల హక్కు!.....
కాజీపేట అయోధ్యపురంలో నిర్మాణం దాదాపు పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు ప్రతీక. వరంగల్ జిల్లా ప్రజల చీరకాల కోరిక. ఈ ప్రాజెక్ట్ కోసం జరిగిన దీర్ఘకాల పోరాటాలు, ప్రజా ఒత్తిడులు, ప్రతినిధుల హామీలు అన్ని కలిసి సాధించిన ఫలితం ఇది.
1. చారిత్రక పోరాటం - చేజారిన అవకాశాలు
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అనేది కేవలం ఒక పరిశ్రమ కాదు, అది ఈ ప్రాంత ఆత్మగౌరవ ప్రతీక. 1980వ దశకంలోనే రాజీవ్ గాంధీ హయాంలో ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న హామీ రాయబరేలీకి తరలిపోయింది. ఆ తర్వాత పీవీ నరసింహారావు గారి హయాంలో మంజూరైనా, రాజకీయ కారణాలతో పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని 13వ షెడ్యూల్, 10వ అంశంగా పొందుపరిచినప్పటికీ, కేంద్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడి జాప్యం జరిగింది. ఎన్నో నిరసనలు, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షల తర్వాత ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చి కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చివరి దశకు చేరిన నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగావకాశం కల్పించే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది.అయితే ఒక బేసిక్ ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తోంది:
కోచ్ ఫ్యాక్టరీ మన నేలపై, మన భూములపై నిర్మాణమైతే, ఉద్యోగాల్లో మన పిల్లలకు ప్రాధాన్యం దక్కకూడదా?
మడికొండలో ఇటీవల జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఈ ప్రశ్నకే సమాధానం కోరింది. తెలంగాణ రైల్వే JAC ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. సందేశం స్పష్టం—ప్రారంభోత్సవ వేడుకల కంటే ముందుగా నియామకాలపై స్పష్టత అవసరం.
భూములు కోల్పోయిన అయోధ్యపురం గ్రామ కుటుంబాలు అభివృద్ధి కోసం త్యాగం చేశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా యువతలో నిరుద్యోగం తీవ్రంగా ఉంది. రైల్వేలో ACT అప్రెంటిషిప్ పూర్తి చేసిన అనేక మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్ ఫ్యాక్టరీలో నియామకాలు పూర్తిగా బాహ్య నియామకాలుగా జరిగితే అది సామాజిక న్యాయానికి విరుద్ధం.
ప్రభుత్వాలు తరచూ “అభివృద్ధి”ని ప్రస్తావిస్తాయి. కానీ అభివృద్ధి ఫలాలు స్థానికులకు అందనప్పుడు అది కేవలం గణాంకాల అభివృద్ధి మాత్రమే అవుతుంది; ప్రజల జీవన ప్రమాణాలు మారవు. కాబట్టి రాష్ట్ర అసెంబ్లీలో స్పష్టమైన తీర్మానం చేసి కేంద్రానికి పంపడం అవసరం. స్థానిక ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై గళమెత్తాలి. కేంద్ర మంత్రులు రైల్వే శాఖతో సమన్వయం చేసి నియామక విధానంపై స్పష్టత తీసుకురావాలి.
డివిజన్ సాధన కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అనేది చాలా న్యాయ సమ్మతమైన, సహేతుకమైన డిమాండ్. అన్నిరకాల అవకాశాలున్న కాజీపేటను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా కార్మికులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. సౌత్‌సెంట్రల్ రైల్వేలోనే ఆరు డివిజన్లలో అనగా.. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల అన్నిటికంటే కూడా మనం కోరుకునే కాజీపేట డివిజన్ పరిధిలోనే ఆదాయం అత్యధికం. మొత్తం సౌత్‌సెంట్రల్ రైల్వేలో 46.8శాతం ఆదాయం ఈ డివిజన్ పరిధి నుంచే ఉంటుంది.. ఇతర డివిజన్ల అన్నింటికంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు (సుమారు 12,000మంది) ఉన్నారు. విశ్రాంతి ఉద్యోగుల కుటుంబాలు సుమారు 18వేల దాకా ఉన్నాయి.. ప్రతిపాదిత కాజీపేట డివిజన్ పరిధిలో మూడు జంక్షన్లు అధికారికంగా పెద్దపల్లి, డోర్నకల్, కారెపల్లి, అనధికారికంగా మానిగర్, జగ్గయ్యపేట జంక్షన్లు ఉన్నాయి. మొత్తం స్టేషన్లు 83 ఉన్నాయి. ఈ డివిజన్ పరిధి హైదరాబాద్ రైల్వే మార్గంలో పెంబర్తి స్టేషన్ వరకు, విజయవాడ మార్గంలో కొండపల్లి స్టేషన్‌వరకు, భద్రాచలం మార్గంలో మణుగూరు, ఢిల్లీలో మార్గంలో మానిఘర్ స్టేషన్ వరకు, ఫండరీపాణి, ఘట్‌చందూర్ వరకు, లింగంపేట, జగిత్యాల స్టేషన్ల వరకు పరిధి ఉండేలా డివిజన్ ఏర్పాటు చేయొచ్చు.
ఇది ఎవరికీ వ్యతిరేక పోరాటం కాదు. ఇది హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేసే విజ్ఞప్తి.
మార్చి 15న కోచ్ ఫ్యాక్టరీ వద్ద నిరసన దీక్ష, పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీలో కార్యక్రమం చేపట్టాలనే నిర్ణయాలు ప్రజల్లో పెరుగుతున్న ఆవేదనకు ప్రతిబింబం. ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కేవలం పరిశ్రమ కాదు—ఇది ప్రాంతీయ సమతుల అభివృద్ధికి అవకాశం.స్థానికులకు ప్రాధాన్య నియామకాలు, భూ నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీలు, అప్రెంటిస్‌లకు న్యాయమైన వాటా ప్రకటిస్తే ప్రభుత్వాలకు ప్రజా మద్దతు మరింత బలపడుతుంది. లేదంటే సాధించిన విజయమే అసంతృప్తికి కారణమవుతుంది.ప్రారంభోత్సవ రిబ్బన్ కట్టడం ఒక వేడుక మాత్రమే. కానీ ఆ ఫ్యాక్టరీ గేట్లు తెరుచుకున్నప్పుడు లోపల పని చేసే యువకుడు స్థానికుడైతేనే అది నిజమైన విజయోత్సవం అవుతుంది .పాలకుల నిర్లక్ష్యం వల్లో, తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువతకు అన్యాయం చేసే కేంద్ర ప్రభుత్వపు వివక్షపూరిత నియామక విధానాల వల్లో ఈ అవకాశం చేజారితే రాబోయే తరాలు మనల్ని క్షమించవు.
ప్రభుత్వాలు ఈ సందేశాన్ని గంభీరంగా స్వీకరించి, వెంటనే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు న్యాయం చేసేవిధంగా స్పష్టమైన నియామక విధానం ప్రకటించాలి. అభివృద్ధి అంటే భవనాలు కాదు—స్థానిక యువత ముఖాల్లో కనిపించే ఉపాధి వెలుగు.కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లో స్థానికులకే 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. రైల్వేలో వ్యాపార అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ న్యాయమైన డిమాండ్ల సాధన వరకు మన పోరాటం ఆగకూడదు.
-- *బండి. దుర్గా ప్రసాద్
రైల్వేకోచ్ ప్యాక్టరీ సాధన పోరాట కమిటీ కన్వీనర్*
7981184205